ఓ సగటు భారతీయుడు

  • 0
మారాలి మారాలి నా భవిత మారాలి,

ఆకలి మంటల ఆర్తనాదం, కాలిన కడుపుల కొత్తవాదం,
తీరని అప్పుల ఆర్థిక భారం, పెరిగిన వడ్డీ విడ్డూరం,
పండని పంటల పేద బతుకు, మింగటానికి లేదు మెతుకు ,
రాలిన గింజ చేసిందా నేరం, గిట్టుబాటు లేకపోవటం మరింత ఘోరం,

ఇంకా ఏన్నాళ్ళు, మారాలి మారాలి నా భవిత మారాలి,

పట్నం లో ఓ మూల పని కోసం వచ్చా, దళారీల దోపిడీ లో నలిగిపోయి చచ్చా,
పని కొసం పది మైళ్ళు వెళ్ళా, ఖాళీ కడుపుతో కాయ కష్టం చేసా,
పెరిగిన ధరలు గుదిబండై మీదుంటే, తరగని ఆశలు తల్లకిందులు చేస్తున్నాయి,
రుపాయికెడ్చా , రోగానికెడ్చా, ఏమి చెయలేక ఆశల చితి పేర్చా,

ఇంకా ఏన్నాళ్ళు, మారాలి మారాలి నా భవిత మారాలి,

కులం పేర కుళ్ళు రాజకీయం, మతం పేర మతతత్వవాదం,
పబ్బం గడిపే ప్రజా ప్రతినిధులు, వెర్రి తలలు వేసిన వేర్పాటువాదులు,
కడుపు నిండిన వాడి దగా దౌర్జన్యం, కడుపు ఎండిన వాడి బతుకు దా"రుణం",
తూటాలతో తూట్లూ పోడుస్తున్న తీవ్రవాదం, ఊరుకుక్కలా విరుచుకుపడుతున్న ఉగ్రవాదం,

ఇంకా ఏన్నాళ్ళు, మారాలి మారాలి నా భవిత మారాలి,

అవును, లేవాలి లేవాలి నీ రాత నువ్వే మార్చుకోవాలి,

కడుపుమంటలోని కసి ఎంతో చూపు ,
మండుతున్న గుండెల మంటల్లో కలుపు,
కష్టాల కన్నీళ్ళు ఉప్పెనలా మార్చు,
ఉవ్వెత్తున ఎగిసే జనాగ్రహం లో ముంచు,

అవును, లేవాలి లేవాలి నీ రాత నువ్వే మార్చుకోవాలి,

ఓ సగటు భారతీయుడు.

--  సాయి కార్తీక్

    No comments:

    Post a Comment